సాహిత్యం
కేతవరపు రాజ్యశ్రీ సాహితీ నేపధ్యమున్న కుటుంబంలో నుంచి వచ్చారు. వీరి పితామహులు కీ||శే|| విద్వాన్ మహాకాళి వేంకటేశ్వరరావుగారు చెళ్ళపిళ్ళ వారి శిష్యులు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు, రాజ్యశ్రీ తాతగారు కలిసి చదువుకున్నారు. ఆవిడ తాతగారు బహుభాషా కోవిదులు. పదవీ విరమణానంతరం M.A., Lit చేసి విద్యార్జనకి వయసుతో నిమిత్తంలేదని నిరూపించారు. వీరు ''శ్రీ వేంకటేశ్వర శతకము'', ''రవీంద్రుని జీవిత సంగ్రహము'' ''కృష్ణకుమారి'', చరిత్ర విషయక నవలలు, హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ (ఇంగ్లీషులో), జాగ్రఫీలో పాఠ్యాంశాలు, తెలుగు టు ఇంగ్లీషు పాకెట్ డిక్షనరీ, ఇలా అనేక ఇతర రచనలు చేశారు. నిత్య విద్యార్థికి మల్లే, డెభైయేళ్ళ వయసులో కూడా ఇంగ్లీషులో కొత్త పదాలకు అర్థాలు డిక్షనరీ చూసి తను నేర్చుకుని, వాళ్ళకి ఆ పదప్రయోగం చేస్తూ వాక్య నిర్మాణం కావించమని చెప్పమని ప్రోత్సహించేవారు. చక్కని భాషా పరిజ్ఞానం, స్ఫూర్తి వారి దగ్గర నుంచి లభించిన అమూల్య సంపద.
రాజ్యశ్రీ నాన్నగారు కీ||శే|| మహాకాళి వేంకటరావు గారు తండ్రిని మించిన తనయులు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి శిష్యులు. అడపా దడపా వారిని రాజ్యశ్రీ ఇంటికి పిలిచి, కాలనీ వారందరిని సమావేశపరచి వారి ప్రసంగాలు ఏర్పాటు చేసేవారు. వారు రచించిన రామాయణ కల్పవృక్షంలోని పద్యాలు వారిచేత బట్టీ కొట్టించి, ఆయన ముందు చెప్పించేవారు. ఆమె నాన్నగారు వృత్తిరీత్యా ఎ.జి. ఆఫీసులో ఆడిట్ ఆఫీసరు, ప్రవృత్తిరీత్యా కవి, నటులు, నాటక రచయిత, జ్యోతిష వాస్తు శాస్త్ర పండితులు. ''అయోమయం'', ''అదేమిటి'' అనే హాస్య నాటకాలు రచించి, నటించారు. ఎ.జి. ఆఫీసులో ''తెలుగు నాటక సమితి'', ''రంజని'' సంస్థలకు వ్యవస్థాపక అధ్యక్షులు.
జ్యోతిష శాస్త్రంలో విశేష ప్రతిభ కనపరచినందుకు ''దైవజ్ఞ శిరోమణి'' అనే బిరుదును పొందారు. శ్రీ లలితా ఉపాసకులు. చిన్నతనంలోనే ''లలితా సహస్రనామ'' పారాయణం, పూజావిధానం నేర్పించారు. తనతోపాటు కవిసమ్మేళనాలకూ, సాహితీ సమావేశాలకు తీసుకెళ్ళేవారు. ఆమె అమ్మగారు శ్రీమతి ప్రభావతి ప్రముఖ వీణావిద్వాంసురాలు. సంగీత సాహిత్యాల నేపధ్యంలో పెరగడంవలన, ఆమె అమ్మ నుంచీ వీణ వాయించడం, నాన్న దగ్గర నుంచి సాహిత్యాభిలాష సహజంగా అలవడినాయి.
రాజ్యశ్రీ 1977లో సచివాలయంలో ఉద్యోగంలో చేరారు. అక్కడ ఉద్యోగినులకు సరి అయిన సదుపాయాలుండేవికావు. వాష్ రూమ్స్ రెండు మూడు బిల్డింగులకి ఒకటి ఉండేది. గర్భిణీలకు విశ్రాంతి గదులు కానీ, సచివాలయంలో ఉన్న డిస్పెన్సరీలో గైనకాలజిస్ట్ కానీ, లంచ్ రూమ్స్ కానీ ఉండేవికావు. టాయ్‌లెట్స్‌కి వెళ్ళాలంటే అదో పెద్ద పనిలాగా వేరే బిల్డింగులోని నాల్గవ అంతస్తులోకో అయిదో అంతస్తులోకో వెళ్ళాల్సి వచ్చేది. లైట్లు ఉండేవికావు. ఈ పరిస్థితులలో ఉద్యోగినుల కోసం ప్రత్యేకంగా ఒక 'సంక్షేమ సంఘం'' పెట్టుకుంటే, ఈ పరిస్థితులను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి, కొన్ని సదుపాయాలు చేసుకోవడానికి వీలవుతుందని ఆలోచన చేసి, ఇతర ఉద్యోగినులతో కలిసి''ఆం.ప్ర. సచివాలయ ఉద్యోగినీ సంక్షేమ సంఘం'' స్థాపించుకున్నారు. రాజ్యశ్రీ దానికి వ్యవస్థాపక కార్యదర్శిగా, స్వయంప్రభ ఉపాధ్యక్షురాలిగా, పద్మ సంయుక్త కార్యదర్శిగా, సి. భవానీదేవి, జె. సుభద్ర, ఎస్. రమాదేవి సలహాదారులుగా ఇలా తల ఒక పదవి తీసుకుని దానిని రిజిష్టరు చేయించారు. అప్పట్లో కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారిని కలిసి, సంస్థ ఆవిర్భావము, ఆశయాలు వివరించాము. దానికి ఆయన చాలా సంతోషించి ప్రభుత్వం తరఫున మీకేమి సహాయం కావాలన్నా చేస్తాను అని హామీ ఇచ్చారు. ఉద్యోగినులకు ప్రత్యేకించి కావలసిన సదుపాయాల గురించి ఆయనకు ఒక మెమోరాండము ఇచ్చారు.
అలా ఆమె టీమ్‌తో కలిసి కొన్ని సెమినార్స్ కండక్ట్ చేశారు. ''స్త్రీలు-ఆర్థిక స్వాతంత్య్రం'' ''జెండర్ ఇన్ ఈక్వాలిటీ'', ''ఉమెన్ అండ్ వర్క్ కల్చర్'', ''ఉమెన్ ఎంపవర్‌మెంట్'' ఇలా అవగాహనా సదస్సులు పెట్టి, ఆర్థిక మంత్రిని, అన్ని రంగాలలో ఉన్నత పదవులలోవున్న ఉద్యోగినులను పిలిచి, వారి అనుభవాలను, సాధక బాధకాలను, సూచనలను ఆకళింపు చేసుకన్నారు.
ఆ రోజుల్లో చాలామంది ఉద్యోగినుల దగ్గర బస్‌పాస్‌కి మాత్రం డబ్బులుండేవి. వారి జీతాలు మొత్తం భర్తలకిచ్చి 'టీ' తాగడానికి కూడా డబ్బు లేకుండా బస్‌లో వచ్చి బస్‌లో వెళ్ళేవారు. అటువంటి వారందరికీ ఈ సెమినార్స్ ద్వారా వ్యక్తిత్వ వికాస దిశగా అడుగులు వేయించి, వారిచేత సొంతంగా బ్యాంక్ అక్కౌంట్లు తెరిపించి, జీతాలను దాంట్లో వేసుకునే ధైర్యాన్ని ఆమె సంక్షేమ సంఘం సాధించింది. స్త్రీలు పని చేసే సీట్లలో, ఉద్యోగులు వారిని బాధిస్తుంటే, బయటకు చెప్పుకోలేక కుమిలిపోయే ఉద్యోగినులకు అండగా నిలిచి, పై అధికారులతో మాట్లాడి అక్కడ నుంచి బదిలీ చేయించడమో, లేక సదరు ఉద్యోగిపై కంప్లైంట్ చేయడమో, చేసి పరిస్థితులను చక్కదిద్దేవాళ్ళు.
రాజ్యశ్రీ అధ్యక్షురాలుగా ఉన్న టైమ్‌లో చేపట్టిన పనులు
- ఉద్యోగినులకు లంచ్ రూమ్ ఏర్పాటు
- బిల్డింగ్‌కి రెండు చొప్పున వాష్‌రూమ్స్ కట్టించారు.
- సచివాలయ డిస్పెన్సరీలో గైనకాలజిస్టు పోస్టు శాంక్షన్ చేయించి పోస్ట్ చేయించారు.
- లంచ్ టైమ్‌లో స్త్రీలకు యోగా క్లాసులు.
- ఉద్యోగినుల కోసం ప్రత్యేకంగా లేడీస్ స్పెషల్ బస్సులు వేయించారు.
- ఆంధ్రా బ్యాంక్ వారి సహకారంతో ఉద్యోగినులకు ''స్త్రీ చక్ర'' పథకం ద్వారా టూ వీలర్ కొనుక్కోవడానికి లోన్స్ ఇప్పించారు.
- సచివాలయ క్యాంటిన్లలో స్త్రీల కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేయించారు.
- ఉద్యోగినులలో ఉన్న ప్రతిభ వెలికితీసి వారిచేత రేడియోలో పాటలు, నాటికలు వేయించేవారు.
- సెంట్రల్ గవర్నమెంటుతో సమానంగా మెటర్నిటీ లీవు 3 నుంచి 4 నెలలకి పెంచేందుకు కృషి చేసి చేశారు.
రాజ్యశ్రీ సంక్షేమ సంస్థ ఇంతై వటుడింతై అన్నట్టు వేళ్ళూనుకుని మిగతా ఏ సచివాలయ సంస్థలూ చేయలేనంత అద్భుతమైన సంక్షేమ పథకాలు నిర్వహిస్తూ, ఇతర సంస్థల గుండెల్లో గుబులు పుట్టించింది.
ఈ సంస్థకు ఆమె వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఉండటం ఆమెకెంతో గర్వకారణం.
చేతన ఆవిర్భావం :
1991లో ''చేతన సచివాలయ సారస్వత వేదిక'' అనే సాహితీ సంస్థ ఆవిర్భవించినది. కొంతమంది సాహితీ మిత్రులు కలిసి 'చేతన' అనే మొక్కని నాటారు. యాంత్రికమైన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులకు, వారి అంతరంగాల్లో కవిత్వంపట్ల నిగూఢంగావున్న ఆర్తిని తృప్తిపరచి మనోల్లాసం కలిగించడానికి ''చేతన'' సంస్థ ఆవిర్భవించింది. చేతన నెలనెలా సాహితీ వెన్నెలలు వెదజల్లుతూ, చర్చలూ-గోష్ఠులూ, కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ వచ్చింది.
అనేక మంది ప్రముఖ సాహితీమూర్తులు 'చేతన' వేదిక మీద ప్రసంగించారు. శ్రీయుతులు మధురాంతకం రాజారం, ఆచార్య తిరుమల, అద్దేపల్లి రామ్మోహన్‌రావు, తనికెళ్ళభరణి, నండూరి రామకృష్ణమాచార్య ఇలా అనేకమంది సాహితీవేత్తలు ప్రసంగించి సచివాలయ కవులకూ రచయితలకూ స్ఫూర్తినిచ్చారు.
కొంత కాలానికి ''చేతన''లో చైతన్యం తగ్గింది. కార్యక్రమాలు నిర్వహించడానికి రూపాయి కూడాలేని పరిస్థితి. ఆ తరుణంలో 2006లో ఆమెను అధ్యక్షురాలిగా, ఎన్. ప్రసాద్‌ని కార్యదర్శిగా ఎన్నుకుని చేతులు దులుపుకుని ఎవరిదారిన వాళ్ళు తప్పుకున్నారు. వృత్తిరీత్యా ఉపకార్యదర్శి హోదాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రవృత్తిగా చేతన అధ్యక్షురాలిగా అనేక కార్యక్రమాలను నిర్వహించారు. కొంత ఆమె చేతిమీద, కొంత సాహిత్యాభిమానుల ఆదరణతో నెల నెల సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీ వ్యయనామ సంవత్సర ఉగాదికి, కవితా పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇంకా ప్రోత్సాహక బహుమతులు పెట్టారు. దానితో ''చేతన'' మళ్ళీ తిరిగి చైతన్యం సంతరించుకుంది. అనేకమంది పాత, కొత్త సచివాలయ ఉద్యోగులు దీనిలో సభ్యులుగా చేరారు. పోటీకి కవితలు పంపారు. ఈ కవితలన్నింటినీ ఒక సంకలనం చేసి పుస్తకంగా వేస్తే బాగుంటుందని అనిపించి పెద్ద హోదాలోవున్న ఆఫీసర్ల పి.ఎ.లను కలిసి కొన్ని అడ్వర్ టైజ్‌మెంట్స్ సంపాదించి ఆ డబ్బుతో ''కవితా చేతన'' అనే కవితల సంకలనాన్ని ప్రచురించారు. శ్రీ ఎస్. రామనరసింహ (సరసి) (చేతన సభ్యులు) మంచి కార్టూనిస్ట్. ఆయన ఈ పుస్తకానికి ముఖచిత్రం, కవితలకు రేఖాచిత్రాలు గీసి పుస్తకాన్ని అందంగా మలచడానికి కృషి చేశారు.
ఇదే ఉత్సాహంతో కథాసంకలాన్ని తేవాలనే ఉద్దేశ్యంతో సచివాలయంలోని రచయితలు రాసిన కథల సంపుటి ''చేతన కథాఝరి'' అనే పుస్తకాన్ని వెలువరించారు.
తరువాత ''గృహహింస చట్టం-మహిళకు రక్షణ కవచం'' అనే పుస్తకాన్ని ఆమె స్వయంగా సమాచారాన్ని సేకరించి, క్రోడీకరించి చక్కని సమాచారాన్ని పొందుపరచి, Dr. Kiran Bedi, IPS గారిచేత ఆవిష్కరింపజేశారు.
తరువాత సచివాలయ ఉద్యోగులు రాసిన కథలు, కవితలు, వ్యాసాలు పొందుపరుస్తూ ''కలాల కదంబం'' అనే మరో పుస్తకాన్ని ప్రచురించారు. పర్యావరణ పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు అనే మరో చిన్న బుక్‌లెట్‌ని కూడా ప్రచురించారు.
ప్లాస్టిక్ సంచుల నిషేదం గురించి ప్రాచారం చేసి సచివాలయంలో, క్యాంటిన్లలో ప్లాస్టిక్ సంచులు నిషేధించే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయించారు.
డా|| అక్కినేని నాగేశ్వరరావు గారిచే, నూలు సంచుల పంపిణీ కార్యక్రమము చేపట్టి, ఉద్యోగులందరికీ ఉచితంగా నూలు సంచులు పంచిపెట్టారు.
సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమాలు చూసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమవంతు సహాయం అందించారు. వారి వారి పరపతిని ఉపయోగించి, ప్రకటనలు ఇప్పించి ''చేతన'' కార్యక్రమాలను నిరాఘాటంగా కొనసాగించడానికి సహాయ సహకారాలు అందించారు.
ఒక్క రూపాయి కూడా లేని ''చేతన'' సంస్థకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే స్థాయికి తీసుకువచ్చి కార్యక్రమాలు చేయడానికి డబ్బు ఇబ్బందులు లేకుండా చేశారు.
ఈ పుస్తకాల ఆవిష్కరణలకు గొప్ప గొప్ప సాహితీవేత్తలను పిలిపించి, ఆవిష్కరింపజేసి వారిచే సచివాలయ ఉద్యోగులలోని కవితా పటిమకు మెరుగు పెట్టే విధంగా సూచనలు, సలహాలు ఇప్పించారు. వారిలో డా|| మల్లెమాల, డా|| సి.నా.రె., డా|| ఎన్. గోపి, అద్దేపల్లి రామ్మోహనరావు, ఇలా అనేకమంది ప్రముఖులున్నారు.
ఇలా పెద్దవారితో పరిచయం, వారితో మాట్లాడినప్పుడు పూల సువాసన కొంత దారానికి అబ్బినట్టు ఆమెలో అంతర్లీన కవితా ఆర్తి బయలు వెడలి, ఆమె కూడా కవిత్వం రాయచ్చు అనిపించింది. అంతకుముందు ఉగాది కవి సమ్మేళనంలో చదివిన ''మేఘమాల'' అనే కవితను ''తేజో ప్రభ'' పత్రికకు పంపడం, అది ముద్రితం కావడంతో, ఆమెలో ఉత్సాహం రేకెత్తి ఆపై, అడపా దడపా కవితలు రాసి సాహిత్య వేదికలపై చదివారు. కవి సమ్మేళనాలలో పాల్గొనడం జరిగింది. అందులో వ్యయనామ సంవత్సర ఉగాది కవితల పోటీల్లో రాజ్యశ్రీ కవిత ''రూపాయి''కి ద్వితీయ బహుమతి రావడం ఆమె నమ్మలేని నిజం. అప్పట్లో డా|| ఎన్. గోపిగారి ''నానీలు'' ఆమెను ఆకర్షించాయి. నాలుగు లైన్లలో చక్కని భావం వ్యక్తీకరించే అవకాశం, దానికి ఏ విధమైన ఛందస్సు అవసరం లేకపోవడం, అడపా దడపా కొన్ని 'నానీలు' రాసి ఫ్రెండ్స్‌కి వినిపిస్తే, వారు చాలా ''బావున్నాయి రాస్తూవుండు, మంచి కవయిత్రివవుతావు'' అని ప్రోత్సహించారు. అలా అలా 108 నానీలు రాసి ''చిరు సవ్వడులు'' పుస్తకాన్ని ఆగస్టు 21, 2008న ప్రచురించి, వారి 'చేతన' సంస్థ ద్వారా జ్ఞానపీఠ అవార్డు గ్రీత డా|| రావూరి భరద్వాజగారు, దూరదర్శన్ డైరెక్టర్ డా|| పాలకుర్తి మధుసూదనరావుగారు, అప్పటి తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి డా|| ఆవుల మంజులతగారి చేతులమీద ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తక సమీక్ష ఆంధ్రప్రభ, ఈనాడు, ఆంధ్రభూమి ఇంకా అనేక దినపత్రికలలో ప్రచురించడం జరిగింది. సామాజిక స్పృహ కలిగిన కవితలుగా, మంచి కవయిత్రిగా పేరు తెచ్చుకున్నారు. పాఠకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
అలా ఒకసారి నానీలు పుస్తకాన్ని వెలువరించగానే, ఆమె ఏ అంశం మీద స్పందించినా, ఆ భావం ఒక 'నానీ'గా రూపుదిద్దుకుంది. అందుకే ''చిరుసవ్వడులు'' పుస్తకం వెలువడిన 8 నెలలలోపే ఆమెలోని భావ తుంపరులకు అక్షరాకృతిని కల్పించి ''గుండె చప్పుళ్ళు''గా వెలువరించారు. మొదటిది ఆమె చిరు ప్రయత్నం. రెండవది ఆమె గుండె చప్పుళ్ళు.
ఈ పుస్తకాన్ని, ఆమె అభిమాన నటులు, నటనకే భాష్యం చెప్పిన అక్కినేని నాగేశ్వరరావుగారికి అంకితమివ్వాలని ఆమె ప్రగాఢ వాంఛ. అందుకు వారు అంగీకరించి ఆమె ఈ కృతిని అంకితమందుకోవడానికి అంగీకరించి ఆమె అభీష్టాన్ని నెరవేర్చడమేకాక, ''మీరు ఇప్పుడు నాకు అత్తగారు. అల్లుడు అడిగినవన్నీ ఇవ్వాలి మరి'' అంటూ చమత్కరిస్తూ ఆమెతో సంభాషించడం ఆమె జీవితంలో మరపురాని అనుభూతి. అలాగే అప్పట్లో పశుసంవర్థక శాఖామాత్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్‌గారు ముందు మాట రాసి ఆశీర్వదించారు. డా|| గజల్ శ్రీనివాస్ గారు దీనిని ఆవిష్కరించి కొన్ని నానీలను రాగయుక్తంగా పాడి వినిపించడం ఆమె అదృష్టం.
తరువాత రాజ్యశ్రీ ఒంగోలు తెలుగు మహాసభలో పాల్గొని చదివిన కవిత ''సహస్రావధాని'' చాలామంది బాగుందని ప్రశంసించారు. వివిధ కార్యక్రమాలలో కవి సమ్మేళనాలకు ఆహ్వానం అందుకుంటూ అనేక కవితలు రాశారు. వాటిని సంకలనం చేసి ''ఊహల వసంతం'' అనే పేరు పెట్టి 2010 ఏప్రిల్‌లో ఆవిష్కరించారు. దీని కవర్ పేజీకి, ఆమె స్నేహితురాలు రాణి (యుఎస్‌ఎలో కెంటకిలో ఉంటుంది) వాళ్ళ ఇంటి బ్యాక్‌యార్డ్‌లో తీసిన చక్కని పిక్చర్‌ని వేశారు. చాలా అందంగా వచ్చింది. ఈ పుస్తకాన్ని శ్రీ సాయి చరణారవిందాలకు అంకితమిచ్చారు. ఈ ''ఊహల వసంతం'' పుస్తకావిష్కరణ అక్కినేని గారి చేతులమీద జరగడం ఆమెకు చాలా అత్యంత సంతోషకరమైన విషయం.
అప్పటి నుంచి అన్ని పత్రికలకు ఆమె కవితలు పంపడం, అవి ప్రచురింపబడటం ఆమెకు మరింత ఉత్సాహాన్నిచ్చింది.
తరువాత వరసగా అన్ని ప్రక్రియలలో కవితలు రాయాలని ''సిసింద్రీలు'' అనే మినీ కవితల సంకలనం, ''వెన్నెల మెట్లు'' అనే రెక్కల ప్రక్రియలో పుస్తకం, అలాగే సాహితీకిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు గారి మానస పుత్రిక, ''వ్యంజకాలు'' అనే ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఆయనకంటే ముందు నేనే 108 వ్యంజకాలు రాసి ''బొమ్మబొరుసు'' అనే పుస్తకం వెలువరించారు.
'అక్షరం' మీద కవిసమ్మేళన సభలో పాల్గొని ''అక్షరం నన్ను వేధిస్తోంది'' అనే కవిత చదివారు. ఈ అక్షరం అప్పటి నుంచి ఆమెను వెంటాడి, చివరకు అక్షరంమీద 108 ముక్తకాలు రాసి ''అక్షర కేతనం'' అనే పుస్తకం వెలువరించారు.
తరువాత ''తృప్తీ నీవెక్కడ'' (2011)లో వచన అనే కవితా సంకలనాన్ని కూడా వెలువరించారు.
''ఊహల వసంతం'' కవితా సంకలనానికి విశ్వసాహితీ సంస్థవారు ఉత్తమ గ్రంథ పురస్కారం, అలాగే నెల్లూరు సృజన సాహిత్య వేదికవారి ఉత్తమ గ్రంథ పురస్కారం లభించాయి. రెండో హనీమూన్ అనే కవితకు ఉత్తమ హాస్యకవితా పురస్కారం లభించింది.
రాజ్యశ్రీ అమ్మ ప్రభావతిగారితో ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్ళడం, నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న భగవద్గీత, ఆమెలో కొంత ఆధ్యాత్మికతను పెంపొందించాయి. ఎవరెన్ని పుస్తకాలు రాసినా, తృప్తి అనేది సంతృప్తిలోనే ఉందనేది ఆమె ప్రగాఢ విశ్వాసం. అందుకే ''సాహితీ కిరణం'' మాసపత్రికలో ఆధ్యాత్మిక కాలమ్ నిర్వహిస్తూ చిన్న చిన్న కథలతో ఆధ్యాత్మిక గుళికలను అందరికీ అర్థమయ్యే విధంగా రాశారు. ఆధ్యాత్మికత అంటే అదేదో ముసలివాళ్ళకి సంబంధించిన విషయంగా చాలామంది అనుకుంటారు. అందుకే ఆధ్యాత్మికతను నిత్య జీవితంలో జరిగే సంఘటనలతో పోలుస్తూ చిన్న చిన్న కథల ద్వారా వ్యక్తీకరించారు. విద్యార్థులు సైతం వీటిని చదివి, మాకు ఇలాంటి విషయాలు తెలియవండీ, ఇవి చదివిన తరువాత మాకు చాలా విషయాలు తెలిసాయంటూ ఉత్తరాల వర్షం కురిపించారు.
వీటన్నిటినీ సంకలనం చేసి ''నీలోకి నువ్వు'' ''ఆధ్యాత్మికత వృద్ధులకేనా'' అనే రెండు ఆధ్యాత్మిక గుళికల పుస్తకాలు వెలువరించి డా|| రమణాచారి, ఐఎఎస్‌గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఇప్పటివరకు 10 పుస్తకాలు, అనేక సామాజిక వ్యాసాలు, కొన్ని కథలు రాశారు.
ఈ పుస్తకాలన్నిటినీ రాజారాంమోహన్ రాయ్ ఫౌండేషన్ కోల్‌కత్తావారు ఖరీదు చేసి, అన్ని ప్రభుత్వ లైబ్రరీలకు పంపించడం జరిగింది. ఇవి లైబ్రరీలలో చదివిన (తెలుగువారు) దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ చేసి బాగున్నాయని తెలపడంతో ఆమె జీవితం ధన్యమైందనిపించింది.
ఆమె పుస్తకాలు చాలామటుకు జి.వి.ఆర్. ఆరాధన సంస్థ చైర్మన్ శ్రీ గుదిబండ వెంకటరెడ్డిగారి ఆధ్వర్యంలోనే జరిగాయి. సచివాలయం నుంచి బయటి కవితా ప్రపంచానికి ఆమెను పరిచయం చేయడం గుదిబండి వారి చలవే!
వారి సంస్థ ద్వారానే డా|| సి.నా.రె. గారి చేతుల మీదుగా ఆమెకు మొదటిసారిగా ''కళా పురస్కార'' ప్రదానం జరిగింది. ''సాహితీ కిరణం'' సాహిత్య మాసపత్రికకు ఆయన గౌరవాధ్యక్షులుగా ఉండి, పొత్తూరి సుబ్బారావుగారి సారధ్యంలో, ఆమెను అసోసియేట్ ఎడిటర్‌గా చేశారు.
అలా మొదలైన రాజ్యశ్రీ సాహితీ ప్రస్థానం, ఇప్పుడు హైదరాబాదులోని సాహితీ సంస్థలన్నిటి ద్వారా సత్కారాలు పొందడమేకాక వారి వారి సభలలో ఆమెను వివిధ దాలలో ఆహ్వానించి, గౌరవిస్తున్నారు. శ్రీ త్యాగరాయగానసభలో ప్రత్యేకంగా ఆమె చేత ఆధ్యాత్మిక ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీ త్యాగరాయగానసభలో లైఫ్ మెంబర్‌గా, అభినందన లయనెస్ క్లబ్ ప్రెసిడెంటుగా, అశోక్‌నగర్ వెల్‌ఫేర్ అండ్ కల్చరల్ సొసైటీలో జీవితకాల సభ్యురాలిగా, 'చేతన' సంస్థకు గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. కొన్ని కొత్తగా వస్తున్న సాహితీ సాంస్కృతిక సంస్థలకు సలహాదారుగా సేవలందిస్తున్నారు.
ఆం.ప్ర. ప్రభుత్వం వారు నిర్వహించిన 4వ ప్రపంచ తెలుగు మహాసభలకు, సాహితీ వేదికలో పాల్గొనడానికి ఆహ్వానించి గౌరవించారు. 'తానా' వారు అమెరికా డల్లాస్ నగరంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానించడం ఆమె సాహితీ ప్రస్థానంలో ఒక మైలు రాయి.
తానా వారి ఆహ్వానం మేరకు తానా సభల్లో స్వీయ కవితా పఠనం కావించి సన్మానించబడ్డారు. 2014 లో వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన 4 వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రసంగించి, కవితాపఠనం చేసి సత్కారం పొందారు. 2015 లో అక్కినేని స్వర్ణ కంకణ పురస్కారం, 2015 లో ధియోలాజికల్ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్ పురస్కారం పొందారు.
''కవిత్వం ఒక తీరని దాహం'' అన్నారు శ్రీశ్రీ. అది రాజ్యశ్రీ పట్ల నూటికి నూరుపాళ్ళూ నిజం. మొదట్లో ఆమె సాహిత్యం మీద మక్కువ చూపిస్తే ఇప్పుడు సాహిత్యం ఆమెను వెంటాడుతోంది.
డా||రాజ్యశ్రీ రచించిన "అక్షరం అస్తిత్వమైన వేళ" కవిత్వం పుస్తకాన్ని ప్రముఖ కవి కేంద్ర సాహితీ అకాడమీ ప్రాంతీయ కన్వీనర్ కె.శివారెడ్డి గారి చేతుల మీదుగా ఎం.కె.సుగమ్ బాబు, మరియు నియోగి అ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
అలాగే ఆమె రచించిన "వంద ప్రశ్నలు-వేల భావాలు" పుస్తకాన్ని ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారి "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమంలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అధ్యక్షులు వీరన్న చినసత్యం, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శ్రీమతి అట్లూరి స్వర్ణ, మరియు ఇతర సంఘం సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు.
కవి రవీంద్రనాథ్ టాగూర్ రచించిన "స్ట్రే బర్డ్స్" కు అనుసృజన గా "వెన్నుల పక్షులు" పుస్తకాన్ని శ్రీ ఎం.కె.సుగమ్ బాబు గారి ప్రోద్భలంతో రచించి పాఠకులకందించారు.
ఆమెకు స్ఫూర్తిదాతలైన ఆమె తాతగారు, అమ్మానాన్నలు, ఇంకా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
చేతన సచివాలయ సాహితీ వేదిక అధ్యక్షురాలిగా నిర్వహించిన సాహితీ కార్యక్రమాలు..
- గురజాడ కవితా పూర్ణిమ - పూర్ణమ్మ అనే అంశం మీద డా|| ఎ. గోపాలరావు గారిచే ప్రసంగ కార్యక్రమం
- శ్రీ చిమ్మపూడి శ్రీరామమూర్తి గారిచే రాగహేల వినూత్న సంగీత సాహితీ కార్యక్రమం
- శ్రీ ఎ.బి.కె. ప్రసాద్ గారు ముఖ్య అతిధిగా కవి సమ్మేళనం
- డా|| ఎన్. గోపి గారు ముఖ్య అతిధిగా కవితా చేతన పుస్తకావిష్కరణ కార్యక్రమం
- కథా సాహిత్యం అనే అంశం మీద డా|| సి. మృణాళిని గారి ప్రసంగం
- శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ గారిచే తెలుగు పద్య కవితా వైభవం మీద కార్యక్రమం
- డా|| ఆవుల మంజులత గారిచే చేతన కథాఝరి పుస్తకావిష్కరణ సభ
- డా|| మల్లెమాల గారిచే ‘స్వాతంత్ర సముపార్జనలో సాహిత్యం పాత్ర’ అంశం మీద ప్రసంగం కార్యక్రమం
- శ్రీమతి అక్కినేని అమలగారిచే పర్యావరణ పరిరక్షణ అవగాహనా సదస్సు
- గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వం ఒక పరిశీలన’ అనే అంశం మీద ప్రముఖ పాత్రికేయులు శ్రీ విజయబాబు గారి ప్రసంగం
- ‘స్త్రీ వాద రచనలు అపోహలు’ అంశం మీద శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారి ప్రసంగం
- ‘సాహిత్యం మానవతా విలువలు’ అంశం మీద పోలీస్ అకాడమీ డైరెక్టర్ డా|| సి.ఎన్. గోపీనాధ్ రెడ్డి గారిచే ఇష్టాగోష్టి.
- పూర్వ గవర్నర్ శ్రీమతి వి.ఎస్. రమాదేవి గారి ఆధ్వర్యంలో సర్వధారి కవిసమ్మేళనం
- దూరదర్శన్ కేంద్ర డైరెక్టర్ డా||పి.మధుసూదనరావు గారిచే రాజశ్రీ గారు రచించిన ‘చిరు సవ్వడులు’ పుస్తకావిష్కరణ
- ‘సాహిత్యం సాంప్రదాయపు విలువలు’ అనే అంశం మీద మహా సహస్రావధాని డా||గరికిపాటి నరసింహారావు గారిచే ప్రసంగ కార్యక్రమం
- శ్రీమతి యద్దనపూడి సులోచనరాణిగారి ముఖ్య అతిధిగా ‘యద్దనపూడి నవలలు’ అనే అంశం మీద ఇష్టాగోష్టి
- తెలుగు భాషకు ప్రాచీన హోదా అంశం మీద ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారిచే ప్రసంగం
- ‘ప్రాచీన సాహిత్యంలో హాస్యం’ అనే అంశం మీద డా|| ఎం. విజయశ్రీ ప్రసంగం
- ‘ఆధునిక సాహిత్యంలో హాస్యం’ అనే అంశం మీద డా||ద్వానా శాస్త్రి, శ్రీ గుండు హనుమంతరావు గార్ల హాస్యావధానం
- శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు ముఖ్య అతిథిగా విరోధినామ ఉగాది కవి సమ్మేళనం.
- వివాహ వ్యవస్థ సామాజిక విలువలు మీద శ్రీమతి జి. సత్యవాణి గారి ప్రసంగం
- ‘జ్యోతిషం ఆరోగ్యం పై ప్రభావం’ అనే అంశం మీద డా||సి.వి.బి. సిబ్రహ్మణ్యం గారి సంభాషణ
- మౌఖిక సాహిత్యంలో మానవీయత అంశం మీద శ్రీ గోరేటి వెంకన్న గారి ప్రసంగం
- శ్రీ శ్రీ కవితా వైశిష్యం అంశం మీద డా||అద్దేపల్లి రామ్మోహనరావు గారి ప్రసంగం
- కొ.కు. గారి సాహిత్యం మధ్య తరగతి మనస్తత్వాలు డా||కాత్యాయని విద్మహే గారి ప్రసంగం
- ‘టెన్షన్ ఫ్రీగా పనిచేయడం ఎలా?’ అనే అంశం మీద డా||బి.వి.పట్టాభిరాం గారి కార్యక్రమం
- ప్రతీ నెలా ఒక సాహితీ కార్యక్రమం
- ప్రతీ ఉగాదికి కవిసమ్మేళనం నిర్వహణ
- ప్రతి సంవత్సరం పర్వావరణ పరిరక్షణ మీద అవగాహనా సదస్సులు, చలన చిత్ర ప్రదర్శన, మొక్కల పంపిణీ, బట్ట సంచి తీసుకెళ్ళే అలవాటుని ప్రోత్సహించడం మొదలైనవి.